పార్టీ గుర్తు పై రగడ.. ఇకనైనా ముగుస్తుందా..

Polish 20200904 220044217

తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయనేతల చూపంతా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టువైపే ఉంది. ఏపీలో అధికారంలో కొనసాగుతున్న వైఎస్సార్‌ సీపీ పార్టీ గుర్తింపు రద్దుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంతో వైసీపీ గుర్తింపు వ్యవహారం విషయం వెలుగులోకి వచ్చింది. రఘురామ కృష్ణంరాజు పార్టీ గుర్తుపై గెలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, దీంతో అతడిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

రఘురామ దీనిపై మాట్లాడుతూ అసలు తాను వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేయలేదని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించానని చెప్పారు. అయితే, తనకు వేరే పార్టీ అయిన వైసీపీ లెటర్‌హెడ్‌మీద ఎలా నోటీసు పంపుతారని, దీంతో ఆ పార్టీ గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశాలున్నాయని అప్పట్లోనే వ్యాఖ్యానించారు.

దీనికి తోడు తమ పార్టీ పేరును జగన్‌ వాడుకుంటున్నారని, వారు తమ పార్టీ పేరు వాడుకుంటున్నందున జగన్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని జూన్‌లో అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. తదుపరి విచారణను నవంబర్‌ 4కు కోర్టు వాయిదా వేసింది.

అయితే, అసలు ఈ కేసు విషయంలో ఏం జరగబోతోంది..? జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపును కోర్టు రద్దు చేస్తుందా..? లేక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును వాడుకోవద్దని హెచ్చరించి వదిలేస్తుందా.. లేక ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా..? ఒకవేళ ఆ పార్టీ గుర్తింపును రద్దుచేస్తే జగన్‌ పరిస్థితి ఏంటి అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. అయితే, దీనిపై ఉత్కంఠ వీడాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు మరి.

Leave a Comment