పోలీసుల ఎంట్రీతో నీళ్లునమిలిన నక్కా ఆనందబాబు..!

అర్ధరాత్రి నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు : ఏపీ ప్రభుత్వం పై డ్రగ్స్ ఆరోపణలు చేసిన మరో టిడిపి నేత పోలీసులు రంగంలోకి దిగేసరికి నాలుక కర్చుకున్నారు. గత నెల రోజులుగా టిడిపి నేతలు కేవలం డ్రగ్స్ అంశంపైనే ఫోకస్ పెట్టారు. రోజూ మీడియా ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన దూళిపాళ్ల నరేంద్రకు ఆధారాలు చూపాలంటూ కాకినాడ పోలీసులు నోటీసు ఇచ్చారు. తాజాగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఇరుక్కుపోయారు.

సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నక్కా ఆనందబాబు.. విశాఖ మన్యంలో వేల కోట్ల విలువైన గంజాయి సాగు జరుగుతోందని, ఈ గంజాయి వ్యాపారం వెనుక విజయసాయిరెడ్డి మనుషుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల హస్తం ఉండబట్టే ఏపీ పోలీసులు కూడా గంజాయి విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసు శాఖ కూడా ఇందులో భాగస్వామ్యం అయిందని ఆయన విమర్శించారు. ( సభలో అచ్చెన్నాయుడు)

నక్కా ఆనందబాబు వివరణ కోరిన పోలీసులు

ఏపీ అధికార పార్టీ నేతల పాత్ర ఉన్నందున గంజాయి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదని.. కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు రావాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. ఇలా అధికార పార్టీ నేతల పైనా.. పోలీస్ శాఖ పైనా నక్కా ఆనందబాబు ఆరోపణలు చేయడంతో విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఆయన నివాసానికి వచ్చారు. గత రాత్రి గుంటూరులోని నక్కా ఆనందబాబు నివాసానికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరారు. మంత్రిగా కూడా పని చేసిన మీరు ఆరోపణలు చేశారు అంటే అవి తీవ్రంగానే ఉంటాయని.. కాబట్టి గంజాయి సాగుతో సంబంధమున్న ఆ నేతలకు సంబంధించిన వివరాలను తమకు ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తనను పోలీసులు ఆధారాలు అడగడంతో నక్కా ఆనందబాబు సీరియస్ అయ్యారు. ఏం తమాషాగా ఉందా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. మీడియాలో చేసిన ఆరోపణలకు ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. తాను అందరి తరహాలోనే ఆరోపణలు చేశానని.. గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించి తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులుగా తాము ఆరోపణలు చేస్తామని.. వాటిని పోలీసులే నిరూపించాలంటే ఆనందబాబు వ్యాఖ్యానించారు. ( అయ్యన్నపాత్రుడు కావాలనే అలా.. ! )

నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అని నిలదీశారు. దాంతో తాము ప్రస్తుతానికి వెళ్లి పోతున్నామని, ఉదయం మరోసారి వస్తామని.. చేసిన ఆరోపణలపై స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని పోలీసులు వెళ్లిపోయారు. ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నోటీసులు జారీ చేస్తామని.. అప్పుడు విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నక్కా ఆనందబాబుకు పోలీసులు స్పష్టం చేశారు.

నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు రావడాన్ని మరో మాజీ మంత్రి జవహర్ తప్పుబట్టారు. ఆరోపణలు చేస్తే ఆధారాలు అడగటమేంటని ఆయన పోలీసుల పైకి ఎదురుదాడి చేశారు. మొత్తం మీద టీడీపీ నేతల తీరు మాత్రం విచిత్రంగానే ఉంది. ఆధారాలు లేకుండా నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తాం.. రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులదే .. అయినా సరే చట్టప్రకారం తమపై చర్యలు తీసుకోవడానికి వీలు లేదని భావిస్తున్నట్టుగా ఉంది.

Leave a Comment