ఏపీలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్న విషయం కేవలం ప్రతిపక్ష మీడియా ప్రచారమే అని భావించడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన మీడియా సమావేశంలో, ఏపీలో ఆర్థిక ఇబ్బందులు మామూలుగా లేవు.. అతి భయంకరంగా ఉన్నాయి అని స్వయంగా అంగీకరించారు. బడ్జెట్ బుక్కుల్లో చూపించకుండా మాధ్యమాదాయాలను చూపి 21 వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిన వ్యవహారం కూడా ఇటీవల బయటకు రావడం.. దానిపై కేంద్రం వివరణ కోరడం కూడా జరిగింది. ( Digital Corrency eRupi )
ఏపీలో ఆర్థిక పరిస్థితిక – విపరీతమైన అప్పులు
అప్పుడు చేయడం తప్పు కాదు. కానీ అప్పులు ఎలా చేస్తున్నారు.. వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారు.. అన్నది మాత్రం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఏ ప్రభుత్వమైనా తనకు వచ్చే ఆదాయంలో తొలుత ఉద్యోగుల జీతభత్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆ తర్వాత అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం.. ఇంకా మిగిలితే ప్రజలకు పంచి మంచి కార్యక్రమాలు చేయవచ్చు. గత కొద్ది నెలలుగా ఏపీలో ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు పడటం లేదు అన్నది సత్యం. అందరికీ జీతాలు అందేందుకు పదో తేదీ రావాల్సి వస్తోంది. ( United Nations Security Council )
ఒక ఉద్యోగి తనకు జీతం రాలేదు అని మెసేజ్ పెట్టగా.. మాజీ సీఎస్ అయిన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, తనకూ పింఛన్ రాలేదు అని రిప్లై ఇచ్చారని అమరావతి జేఏసీ నాయకులు శ్రీనివాస్ చెబుతున్నారు. ఇంతటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి. మాట ఇస్తే దానిని తప్పకూడదు అన్న సంకల్పం ముఖ్యమంత్రులకు ఉండడం మంచిదే. కానీ ఉద్యోగులకు జీతాలు రాకపోయినా.. కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోయినా.. వాటితో తమకేమీ సంబంధం లేదు, తనకు మాత్రం మడమతిప్పని వ్యక్తిగా పేరు ఉంటే చాలు అన్నట్టు వచ్చే ఆదాయాన్ని కాకుండా నెలనెలా వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి బటన్ నొక్కి ప్రజలకు పంచి పెడితే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంతకాలం తట్టుకుంటుంది. ( జగన్ పై ఆశలు )
మాటకు కట్టుబడి ఇంతటి పరిస్థితికి
తాను లేకున్న తన ఫోటో ప్రతి ఇంటిలో ఉండాలన్న ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉండడం మంచిదే.. కానీ ఆ ఫోటో కాన్సెప్ట్ రాష్ట్రాన్ని దివాలా తీసే ఖరీదైనదిగా ఉండకూడదు కదా. ఈ ప్రపంచంలో అప్పుడు చేయని వారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న కూడా ఇటీవల ప్రభుత్వం నుండి వస్తోంది. అప్పులు అందరూ చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో లాగా ఏటా 45 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయలను నేరుగా నగదు రూపంలో ప్రజలకు ఏ రాష్ట్రం పంచి పెడుతున్న దాఖలాలైతే లేవు. పైగా విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో శ్రమతో పునర్నిర్మాణం కావాలే కానీ.. అప్పులు తెచ్చుకొని పంచుకుంటే ఏమవుతుంది. రానురాను ఆదాయం పెరుగుతుందన్న గ్యారెంటీ చర్యలు కూడా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు.
వేల కోట్లు నగదు బదిలీ చేసే కార్యక్రమం కూడా ఆగిపోయి ఉంటే నిజంగానే డబ్బులు నీవేమో అని అందరూ సరిపెట్టుకునే వారు. కానీ నెలనెలా వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కుతూ పంచి పెడుతున్నామని పత్రికల్లో ఒకవైపు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు. ఇది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కిందికి రాదా. వేల కోట్ల నగదును కరోనా సమయంలో పంచడం వల్లనే ఏపీలో ప్రజలు హ్యాపీగా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ నెలనెలా ప్రజలకు డబ్బులు పంచె ఈ ఆలోచన.. కేవలం కరోనా కాలానికి నిర్దేశించింది కాదు కదా. తాను అధికారంలో ఉన్నంతకాలం నవరత్నాల పేరుతో ఏటా వివిధ వర్గాలకు నగదు బదిలీ చేస్తానని మ్యానిఫెస్టోలోనే హామీ ఇచ్చి వచ్చారు. కాబట్టి కరోనా ఆగినా ఈ హద్దులేని నగదు బదిలీ అయితే ఆగదు కదా.
రాబోయే రోజుల్లో జీతాలకు గడ్డు కాలమే
మరి ఎంతకాలం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా.. చివరకు ఆర్ బి కే సెంటర్లను నిర్మించిన వైసీపీ నాయకులకు కూడా బిల్లును చెల్లించకుండా.. రోడ్లు వేయకుండా.. కేవలం ఇలా డబ్బులు పంచుతూ పోవడం ఎంతకాలం. ప్రతీ నెల ఏదో ఒక పేరుతో వేల కోట్లను ప్రజల ఖాతాల్లోకి బదిలీకి సంబంధించిన ప్రకటనలను ఏపీ ప్రభుత్వం ప్రముఖ తెలుగు దినపత్రికలతో పాటు.. ఆంగ్ల దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. రెండేళ్లలో 95 వేల కోట్ల రూపాయల నగదును పంచి పెట్టామని ప్రభుత్వంలోని పెద్దలు పలుమార్లు గర్భంగా ప్రకటించారు. వచ్చిన ఆదాయంతో పాటు అప్పులు చేసి ఇలా వేల కోట్లు పంచిపెట్టడం ప్రభుత్వ పెద్దలకు గర్వంగా అనిపిస్తూ ఉండవచ్చుగానీ.. ప్రజల్లో మాత్రం ఇలా పంచుకుంటూ పోతే భవిష్యత్తు ఏంటి అన్న చర్చ మొదలైంది.
1 thought on “ప్రభుత్వ పథకాలే ఏపీలో ఆర్థిక పరిస్థితికి కారణమా..”