హైకోర్టు స్టేతో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం..

ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న తనిఖీలు ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. ప్రైవేట్ స్కూళ్లలో సౌకర్యాలు, వసతులు తనిఖీ చేసి తద్వారా ఫీజులు నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కమిషన్ విధి నిర్వహణలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

ఏపీ పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ పేరుతో రెడ్డి కాంతారావు చైర్మన్ గా దీనిని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఈ కమిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యంగా కమిషన్ తన పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ స్కూళ్లలో వసతులు మరియు సౌకర్యాలు తనిఖీ చేసేందుకు నడుం కట్టింది.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈ కమిషన్ కి అడ్డు తగిలాయి. తమకు అన్యాయం జరుగుతోందంటూ కోర్టు కెక్కాయి. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులను ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రశ్నిచాయి. ఒకవేళ అలా నిర్ధారిస్తే.. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణ విధిస్తే నాణ్యత ప్రమాణాలు పడిపోతాయని వాదించాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలికంగా కమిషన్ పై స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఊరట కలిగినట్లయింది.

ఇలా అయితే ఎలా

ఈ కమిషన్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు దోపిడీకి ముక్కుతాడు పడే అవకాశం ఉండేది. ఫీజులతో పాటు.. వాటి కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామక నిబంధనలు అన్నీ ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. కమిషన్ ప్రతి స్కూల్ ను సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాలు మదింపు చేసి ఫీజు నిర్ణయిస్తుంది.

ఈ ఫీజును కూడా విడతలవారీగా చెల్లించుకునే వెసులుబాటు తల్లిదండ్రులకు కల్పిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ ఖాతాలకు సంబంధించిన లెక్కలన్నీ ఈ కమిషన్ కి నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సిలబస్ ని కచ్చితంగా అమలు చేసేలా చూస్తుంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాధికారాన్ని కమిషన్ కు కట్టబెడుతూ గతంలో జీవో విడుదల చేస్తుంది.

తెలంగాణాలో మాత్రం

అయితే హైకోర్టు స్టే తో తాత్కాలికంగా సంస్కరణలకు బ్రేక్ పడింది. విచిత్రం ఏమిటంటే గతంలో తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీ పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ అక్కడి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.

ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తానే స్వయంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కే నోటీసులు కూడా జారీ చేసింది. ఏపీలో మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టు స్టే విధించడం గమనించదగ్గ విషయం.

Leave a Comment