స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కీలక పరిణామం..

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రమేష్ హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు పోలీసుల విచారణకు అనుమతి ఇచ్చింది ఏపీ హైకోర్టు.

న్యాయవాది సమక్షంలో రమేష్ ను విచారించాలని ఆదేశించింది. పోలిసుల విచారణకు హాజరు కావాల్సిందిగా అటు రమేష్ కు హైకోర్టు ఆదేశించింది. విజయవాడలోని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రమేష్ ను విచారించనున్నారు.

విచారణ సమయంలో సామాజిక దూరం పాటించాలని కోర్టు సూచించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ ను రమేష్ ఆస్పత్రి నిర్వహించింది. నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయారు. ఈ కేసులో డాక్టర్ రమేష్ నిందితుడిగా ఉన్నారు.

పోలీసులకు చిక్కకుండా చాలాకాలం పాటు ఆయన తప్పించుకొని తిరిగారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. రమేష్ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు తొలుత రమేష్ ఆస్పత్రి పై తదుపరి చర్యలు తీసుకోకుండా దర్యాప్తును నిలుపుదల చేసింది.

రమేష్ ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటే ముందు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా రమేష్ ఆస్పత్రి పై తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.

దాంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఇదివరకే పక్కనబెట్టింది. రమేష్ ఆస్పత్రి కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తుకు సహకరించాల్సిందిగా అప్పట్లో డాక్టర్ రమేష్ ను కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు తర్వాత విచారణకు హాజరు కావలసిందిగా డాక్టర్ రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులు కూడా రమేష్ స్పందించలేదు. దీంతో ఏపీ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రమేష్ విచారణకు వచ్చేలా ఆదేశించాలని కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా డాక్టర్ రమేష్ ను ఆదేశించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఆయన విచారించేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

Leave a Comment