సుప్రీమ్ కోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ..

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మించేందుకు సిద్ధపడగా అమరావతి వాదులు హైకోర్టును ఆశ్రయించారు.

రాజధాని ఏర్పాటులో భాగంగానే విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. దాంతో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణాలు తప్ప మిగిలిన నిర్మాణాలు కొనసాగించవచ్చని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ అంశం పైనే సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. రాష్ట్రంలో గెస్ట్ హౌస్ నిర్మించాలా వద్దా అన్నది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని.. కానీ దాన్ని నిర్ణయించే అధికారం తమకే ఉన్నట్లుగా హైకోర్టు భావిస్తోందని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం వివరించింది.

రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను ఏపీ హైకోర్టు లాగేసుకుంటుంది అని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజ్యాంగం ప్రకారం తోటి వ్యవస్థల అధికారాలు, హక్కులను గౌరవించాలని.. ఇతర వ్యవస్థల అధికారాలు కూడా తమ అధికారాలే అన్నట్లు కోర్టులు భావించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఏపీ హై కోర్టు పరిగణలోనికి తీసుకోకుండా విస్మరించిందని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం వివరించింది.

జడ్జిలు తమ పరిధిని తెలుసుకొని వ్యవహరించాలని, న్యాయమూర్తులేమి చక్రవర్తులు కారని , ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం న్యాయమూర్తులు చేయకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని కూడా పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఉదాహరించింది. వ్యవస్థల మధ్య సమానత్వపు హక్కు ను ఏపీ హై కోర్టు కాలరాసినట్లుగా ఉందనే భావన ఉత్పన్నమవుతుందని ఏపీ ప్రభుత్వం వివరించింది.

ప్రభుత్వ హక్కులను హైకోర్టు లాగేసుకోవడం ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించింది. కాబట్టి ప్రభుత్వ అధికారాలు, హక్కుల్లో జోక్యం చేసుకునేలా ఉన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసు ఈ వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment