మెలిక పెట్టిన ఏపీ సర్కార్..

భారీ వర్షాల కారణంగా వరద బాధితులకోసం ఏపీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కనుక ఇక, తాము కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి లేదన్న ఆనందంలో ఉన్నారు కదా.. అయితే, ప్రభుత్వం సాయం అందాలంటే కనీసం వారం రోజులకుపైగా వరద నీటిలో ఉన్న బాధితులకే సాయం అంటూ ట్విస్ట్‌ ఇచ్చింది.

వరదనీటిలో ఒక్క రోజు ఉంటేనే ఇంట్లోని వస్తువులన్నీ తడిసి పాడైపోతాయి. బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాలు తడిసిపోతాయి. అయితే, తాజా ఉత్తర్వుల ప్రకారం సర్కారు ఉచితంగా ఇవ్వనున్న ఈ సరుకులు తీసుకోవాలంటే బాధితుల ఇళ్లు కనీసం వారం రోజులు ముంపులో ఉండాల్సిందే. ఒకటి, రెండు రోజులు ముంపునకు గురైన బాధితులకు ఈ సరుకులు అందే అవకాశం లేకుండాపోతుంది.

బాధితులకు రూ.500 ఇవ్వాలని ఇటీవల ఇచ్చిన జీవోపైనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అలాంటిదే మరో ఉత్తర్వు రావడం చర్చనీయాంశమైంది. వరుస వాయుగుండాలతో గ్రామాలకు గ్రామాలే నీటమునిగిపోయాయి. లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాలు నిండా మునిగాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల విన్నపం మేరకు వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు అందించడానికి విపత్తు నిర్వహణశాఖ సోమవారం జీవో 19ను జారీ చేసింది.

‘కనీసం వారం రోజులపైనే బాధితుల ఇళ్లు నీటమునిగి ఉంటే వారికి ఉచితంగా నిత్యావసరాలు అందించాలి. 25 కేజీల బి య్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు ఇవ్వాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేసే విషయంపై కలెక్టర్లు భారీగా ప్రచారం కల్పించాలి’ అని విపత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.ఉషారాణి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, గ్రామాలను వరద ముంచెత్తినప్పుడు సాధారణంగా ఒకటి రెండు రోజుల్లోనే ముంపు తగ్గిపోతుంది. ఆ నీటిలో పేదల ఇళ్లలోని నిత్యావసరాలు, ఇతర వస్తువులు పాడైపోతాయి. బియ్యం, ఇతర ఆహారపదార్థాలు తడిసి ముద్దయిపోతాయి. వాటిని ఉపయోగించడం అసంభవం. వరుసగా వారం రోజులు నీటిలోనే ఉంటే పేదల ఇళ్లు దెబ్బతింటాయి. కూలిపోయే ప్రమాదమూ ఉంది. అలాంటిది వారంపైనే వరదనీటిలో ఉన్నవారికే నిత్యావసరాలు అని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment