ఆరోగ్యశ్రీ లో ఏపీ,తెలంగాణ టాప్ : National Sample Survay

వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ తెచ్చిన పెనుమార్పులు అంతా ఇంతా కాదు. పేదలకు ఏదైనా పెద్ద జబ్బు వస్తే చికిత్స కోసం అప్పులు చేయడంమో.. ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని తెచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేదల్లో ఆరోగ్యంపై ధీమా పెరిగింది.

జాతీయ శాంపిల్ సర్వేలో ఆరోగ్యశ్రీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందో వెల్లడైంది. ఆరోగ్యశ్రీ కారణంగా అత్యధిక శాతం మంది ప్రజలకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ అమలు అవుతుండడంతో ప్రభుత్వం ఆరోగ్య భీమా కల్పనలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం మందికి ఎలాంటి బీమా సౌకర్యం లేదు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80.9 శాతం మందికి భీమా సౌకర్యం లేదు. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతంలో 76.1 శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం బీమా సౌకర్యం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ప్రజల్లో 55. 9 శాతం మంది ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 75.3 శాతం మంది, పట్టణ ప్రాంతంలో 37.3 శాతం మంది ఆరోగ్యశ్రీ కింద భీమా సౌకర్యం పొందుతున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత మరే రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. తమిళనాడులో 14.3 శాతం మంది గ్రామీణులకు మాత్రమే ప్రభుత్వం బీమా సౌకర్యం ఉంది. కర్ణాటకలో ఈ సంఖ్య కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 2.7 శాతంగానే ఉంది. కేరళలో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో 36.8 శాతం మందికి, పట్టణ ప్రాంతంలో 27.9 శాతం మందికి ప్రభుత్వం ద్వారా వైద్య బీమా అందుతోంది.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12.9 శాతం మందికి మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద కవరేజ్ ఉంది. జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం ఆరోగ్యశ్రీ కారణంగా ఏపీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా వైద్య బీమా పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మరీ ఏ ఇతర రాష్ట్రం కూడా వారి ప్రజలకు ఈ స్థాయిలో భీమా సౌకర్యం ఇవ్వలేకపోతోంది.

Leave a Comment