హైకోర్టులో నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ … !

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిర్బంధిస్తూ శనివారం ఆయన జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.

పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసి ఆదేశాలు చెల్లవని తీర్పును వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ( ఈసీ నిమ్మగడ్డకు చెక్ పెట్టిన జగన్.. !! )

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చు అని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాలంటూ ఎస్ఈసి విధించిన ఆంక్షలు చెల్లవని పేర్కొంటూ జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.

16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని డిజిపి సవాంగ్ ను కోరారు ఎస్ఈసి. దీంతో తనను ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డిజిపికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపి వేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది సివి మోహన్రెడ్డి పెద్దిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు.

Leave a Comment