ఆన్ లైన్లో ఆనందయ్య ఆయుర్వేద మందు ..!!

ఆనందయ్య మందు ఇక నుండి ఆన్ లైన్లో అందుబాటులోకి రానుంది. ఈ ఔషదాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. అందువలన ఈ ఔషధం కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో మందు తయారీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ హైకోర్టు నుంచి కూడా అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో మందు తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య.. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి , కాకాని గోవర్ధన్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టారు. దీంతో కృష్ణపట్నం ప్రజల్లో ఆనందం నెలకొంది. ప్రజాప్రతినిధుల సమక్షంలో ఊరు ఊరంతా కలిసి ఆనందయ్యకు ఘనంగా సన్మానం చేశారు.

ఇక నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావాల్సిన అవసరంలేదని.. ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు అందరికీ మందు ఇచ్చాకే, అన్ని జిల్లాల్లో వికేంద్రీకరణ పద్ధతుల్లో మందు పంపిణీ చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. కాకపొతే ఈ ఔషదం పెద్దమొత్తంలో తయారీ చేయాలి కనుక దానికి తగిన మూలికల సేకరణకు కాస్త సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ( ఆనందయ్య ఆయుర్వేదం )

వీటి సేకరణకు కనీసం మూడు రోజుల సమయం పడుతుందని, త్వరగానే ఔషధం తయారీ చేసి అందరికి అందిస్తామని ఆనందయ్య తెలిపారు. తన రక్షణ కోసం ప్రార్థించిన ప్రజలకు, ఔషధ పరిశోధనలు చేసి పంపిణీకి అనుమతి ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కంటి ద్వారా ఔషధం వేయటం మినహాయించి మిగిలిన మూడు పద్ధతుల్లో ఇచ్చే ఔషదానికి అనుమతులు వచ్చాయని.. మిగిలిన పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఔషధ పంపిణీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని.. ఔషధ పంపిణీపై జిల్లా అధికారులు ఓ విధానాన్ని రూపొందిస్తారని..త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి తెలిపారు. అప్పటివరకూ ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని .. కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సంయమనం పాటించాలని ఆనందయ్య మరియు ప్రజాప్రతినిధులు కోరారు.

Leave a Comment