పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!

పంజాబ్ కాంగ్రెస్ లో వర్గ పోరు చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం పంజాబ్ గవర్నర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, గవర్నర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. పిసిసి అధ్యక్షుడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తో నెలకొన్న ఆధిపత్యపోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు అమరేందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే అమరేందర్ సింగ్ రాజీనామా చేయడం విశేషం. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సీఎం పదవికి రాజీనామా అనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ఉదయమే తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సోనియా మాట ప్రకారం ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని.. కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని అమరేందర్ సింగ్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని.. ఇలా జరగడం ఇది మూడోసారి అని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్, ప్రియాంకల జోక్యంతో కాంగ్రెస్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు !

ఇక సిద్ధూ నాయకత్వంలో జరుగుతున్నటువంటి చర్చల అనంతరం, కొత్త నాయకత్వానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సునీల్ కుమార్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, ఎంపీ రవనీత్ సింగ్ బిట్టులలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించనున్నారన్న అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా పంజాబీ పిసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్ధూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. సిద్ధూకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పేందుకు అమరేందర్ ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Leave a Comment