లాక్‌డౌన్‌ కి కౌంట్ డౌన్ .. !!

లాక్‌డౌన్‌ కి కౌంట్ డౌన్ | కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరింత స్పీడుగా దేశాన్ని చుట్టేస్తోంది. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోకి దూసుకుపోతోంది. గతంలో కరోనా రోగుల సంఖ్యలో ఎక్కువ శాతం రికవరీ రేటు ఉండేది. కానీ, ఇప్పుడు కరోనా వ్యాప్తి ఆకాశంలో ఉంటే రికవరీ రేటు భూమి మీద ఉంది. ఈ రెండింటి మధ్య అంత తేడా ఉంటోంది.

ప్రధానంగా ఆక్సిజన్‌ అందక వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో అయితే కరోనాతో మరణించిన వారిని ఖననం చేసేందుకు స్థలం కూడా దొరకడం లేదు. చివరకు శ్మశానాల్లో ఖాళీలేక పబ్లిక్‌ పార్కుల్లో కూడా మృతదేహాలను ఖననం చేస్తున్నారు.

ఇక్కడ రోజుకు 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఐదువేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా పరిస్తితి ఇలాగే ఉంది. దీని నివారణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని స్థానికుల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా, ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కోర్టులు తీవ్రమైన విమర్శలు చేయాల్సి వచ్చింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఇప్పుడిప్పుడే సర్కార్లలో మార్పు వస్తోంది.

కరోనాను అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఢిల్లీ 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అనేక రాష్ట్రాలు ఆ దిశగా చర్చలు మొదలు పెట్టాయి.

తెలంగాణలో అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించేది లేదని చెబుతున్నా అనేక గ్రామాల ప్రజలు, వ్యాపార వర్గాలు తమకు తామే లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. అనేక పంచాయతీల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ తీర్మానాలు చేశాయి. స్వీయ లాక్‌డౌన్‌లు విధించుకునే పరిస్థితి రోజురోజుకూ మరింతగా పెరిగిపోతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తామే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో అనేక రాష్ట్రాలు చర్చలు జరుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని.. కానీ, ప్రాణాల కంటే డబ్బులు ముఖ్యం కాదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అనేక రాష్ట్రాల అడుగులు లాక్‌డౌన్‌ వైపే పడుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

Leave a Comment