విద్యార్థుల్లో అయోమయం .. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. !

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమై పాఠశాలలపై దృష్టి పెట్టింది. విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యక్ష బోధన కొనసాగించాలా?.. వద్దా?.. అన్న అంశంపై ఆలోచిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ నివేదికలోఈ విషయాన్ని సర్కార్ పేర్కొంది.

కరోనా ప్రభావంతో గత సంవత్సరంలో మూతబడిన పాఠశాలలు తిరిగి ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. మొదట 9, 10 తరగతులకు, తరువాత క్రమంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది.

ఇప్పటికే ప్రారంభమైన పలు పాఠశాలలు, గురుకులాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించాలా .. వద్దా.. అన్న అంశంపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా 6, 7, 8 తరగతులతో పాటు 9వ తరగతి విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 10వ తరగతి విద్యార్థులకు మాత్రం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బోర్డు పరీక్షలు ఉన్న కారణంగా వారికి పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పాఠశాలల్లో ప్రత్యక్ష భోధన నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

పరీక్షల సిలబస్ ను తగ్గించి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందించనుంది.

Leave a Comment