జగన్ మోహన్ రెడ్డితో ఆదానీ గ్రూప్ సోదరుల రహస్య భేటీ..?

ఆదానీ గ్రూప్ : తాడేపల్లిలో ఆదివారం రోజున జగన్ మోహన్ రెడ్డితో కీలక వ్యక్తులు భేటీ అయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ సోదరులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ భేటీ అంశాన్ని గోప్యంగానే ఉంచారు.

మూఢ విశ్వాసంతో సజీవంగా సమాధిలోకి.. మరి ఏం జరిగింది..?

గంగవరం పోర్టు కొనుగోలు అంశంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై సీఎంతో వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు వైసీపీ కోటాలో ఆదానీ గ్రూప్ రాజ్యసభ సీటును ఆశిస్తుందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ తరఫున రిలయన్స్ గ్రూప్కి చెందిన పరిమల్ నత్వానీ రాజ్యసభకు వెళ్లారు.

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదానీ గ్రూప్ కూడా ఒక రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా వైసిపి పెద్దలతో ఆదానీ సోదరులకు మంచి సంబంధాలే ఉన్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పలుమార్లు ఆదానీతో కలిసి చర్చలు జరిపిన సందర్భాలూ ఉన్నాయి. ఆదానీ గ్రూప్ వారికి రాజ్యసభ ఇస్తే మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఓడరేవులపై ఆదానీ గ్రూప్ ఇప్పటికే మంచి పట్టు సాధించింది.

ఇటీవల గంగవరం పోర్టును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న ఈ ఆదానీ గ్రూప్.. ఇది వరకే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు కూడా కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆదానీ గ్రూప్ ఏపీలో కీలకమైన వ్యాపార సంస్థగా మారింది. రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జగన్, ఆదానీ భేటీపై అధికారిక ప్రకటన వెలువడలేదన్న అభిప్రాయం ఉంది.

Leave a Comment